Telanagana Bill - అసలు ఏమి జరిగింది
ఉదయం 11 గంటలకు సభ మొదలైనప్పటి నుంచి ఏం జరిగిందంటే...
ఉదయం 11 గంటలు..
లోక్‌సభ ప్రారంభంకాగానే బంగ్లాదేశ్ స్పీకర్ షిరిన్ షార్మిన్ చౌదరిని
స్పీకర్ మీరాకుమార్ సభ్యులకు పరిచయం చేశారు. అప్పటికి ఐదు నిమిషాలు గడిచాయి. వెంటనే
గందరగోళం మొదలైంది. ప్రశ్నోత్తరాల సమయంలో... మొదటి ప్రశ్న హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్
ఒవైసీది. ఆయన్ను మాట్లాడాలని స్పీకర్ కోరుతుండగానే సీమాంధ్ర ఎంపీలు లగడపాటి, బాపిరాజు,
సబ్బంహరి, అనంత వెంకట్రామిరెడ్డి, సాయిప్రతాప్, శ్రీనివాసులురెడ్డి, హర్ష కుమార్, సాంబశివరావు,
మోదుగుల, కొనకళ్ల, శివప్రసాద్, కిష్టప్ప, జగన్, రాజమోహన్ రెడ్డి, ఎస్పీవై రెడ్డిలు
స్పీకర్ పోడియం వద్దకు దూసుకొచ్చారు. కేంద్ర మంత్రులు కావూరు సాంబశివరావు, పురందేశ్వరి,
కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కూడా వెల్‌లోకి వచ్చారు. దీంతో స్పీకర్ సభను 12 గంటలకు వాయిదా
వేశారు. వెల్‌లోకి ఎందుకు వెళుతున్నారంటూ పురందేశ్వరిని వయలార్ రవి ప్రశ్నించారు. ఇందుకు
ఆమె తీవ్రంగా స్పందించారు. 'నా సహచర మంత్రుల్ని అడగండి తెలుస్తుంది' అంటూ పురందేశ్వరి
ఘాటుగా బదులిచ్చారు.
11.50 గంటలు..
సభలో విభజన బిల్లును ప్రవేశపెట్టేందుకు వీలుగా కాంగ్రెస్ అధిష్ఠానం
'పకడ్ - బందీ' వ్యూహం మొదలైంది. రాష్ట్రంలోని తెలంగాణ ఎంపీలతోపాటు ఇతర రాష్ట్రాలకు
చెందిన 30 మంది సభ్యులు తమతమ స్థానాల్లో కూర్చోకుండా... మొదటి వరుస బెంచీల వద్దకు వచ్చారు.
రాజ్‌బబ్బర్, డీకే సురేశ్, మాణిక్ సర్కార్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహా ఎనిమిది
మంది స్పీకర్ పోడియం ఎడమవైపున నిలబడ్డారు. అజారుద్దీన్, చిత్తన్, విశ్వనాథం, ఆరుణ్
యూసుఫ్, తెలంగాణకు చెందిన ఎంపీలు స్పీకర్ పోడియానికి కుడి వైపున.. హోం మంత్రి షిండే
చుట్టూ నిలబడ్డారు. లాల్ సింగ్ సహా మరికొందరు మొదటి బెంచీలో కూర్చున్న చిదంబరం పక్కన
దారిలో... ఎవ్వరూ వెల్‌లోనికి వెళ్లకుండా అడ్డంగా ఉన్నారు.
11.57 గంటలు..
స్పీకర్ సభలోకి రాకమునుపే రగడ మొదలైంది. సీమాంధ్ర టీడీపీ ఎంపీలు
మోదుగుల, శివప్రసాద్ పోడియం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. మోదుగులను కోమటిరెడ్డి
గట్టిగా పట్టుకున్నారు. మిగతా కాంగ్రెస్ ఎంపీలూ ఆయన్ను చుట్టుముట్టారు. అయినప్పటికీ
మోదుగుల తప్పించుకుని... లోక్‌సభ సెక్రటరీ జనరల్ మైకు పట్టుకుని లాగారు. దీంతో మైక్
పైభాగం విరిగిపోయి ఆయన చేతిలోకి వచ్చింది. సెక్రటరీ జనరల్ ముందు ఉన్న రీడింగ్ గ్లాస్‌ను
ఆ మైకుతో బాదడంతో అది పెద్దశబ్దంతో బద్దలైంది. అప్పటి వరకూ సుష్మాస్వరాజ్ వైపు ఉన్న
నామా నాగేశ్వరరావు, రమేశ్ రాథోడ్‌లు వచ్చి మోదుగులతో కలబడ్డారు. కాంగ్రెస్ ఎంపీలు,
టీడీపీ తెలంగాణ ఎంపీలు మోదుగులను చుట్టుముట్టి భౌతిక దాడికి దిగారు. రాజ్‌బబ్బర్, రమేశ్
రాథోడ్, నామా, సురేశ్, మాణిక్ సర్కార్, పొన్నం, «ద్రువ నారాయ ణ, వినోద్ పాండే, మందా
జగన్నాథంలు మోదుగులపై చేయి చేసుకున్నారు.
11.58 గంటలు..
సభ మొత్తం అవాక్కైపోయింది. అసలేం జరుగుతోందో తెలుసుకునేందుకు
అందరి చూపులు 'వెల్'వైపు కేంద్రీకృతమయ్యాయి. టీడీపీ సీమాంధ్ర ఎంపీలు కొనకళ్ల, శివప్రసాద్,
నిమ్మల కిష్టప్ప అప్రమత్తమై... మోదుగులకు రక్షణగా వెళ్లారు. ఆయనను చుట్టుముట్టిన రమేశ్
రాథోడ్, పొన్నం ప్రభాకర్, మందా జగన్నాథం, «ద్రువ నారాయణ తదితరులను పక్కకు లాగేశారు.
ఈ క్రమంలో శివప్రసాద్‌కూ దెబ్బలు తగిలాయి.
11.59 గంటలు..
అధికార పక్షం వైపు నుంచి వెల్‌లోకి వచ్చిన లగడపాటి రాజగోపాల్
రంగంలోకి దిగారు. తన ఎదురుగా సెక్రటరీ జనరల్ ముందు ఉన్న ల్యాప్‌టాప్‌ను ఆయన విసిరికొట్టారు.
మోదుగులపై దాడిని అడ్డుకునేందుకు ఆయన వైపు పరుగుతీశారు. ఇంతలో కాంగ్రెస్ ఎంపీలు అరుణ్
యూసుఫ్, పొన్నం, సుఖేందర్ రెడ్డి, మందాలు లగడపాటిని గట్టిగా పట్టుకున్నారు. బాగా ఎత్తుగా,
బలంగా ఉన్న అరుణ్ యుసుఫ్ తన చేతుల్లో లగడపాటిని బంధించేశారు. క్షణాల్లో మిగతా ఎంపీలు
లగడపాటిపై పిడిగుద్దులు కురిపించారు. దీంతో ఆయన కింద పడ్డారు. అయినప్పటికీ లేచి వారిని
గట్టిగా ప్రతిఘటించారు.
మధ్యాహ్నం 12.00 గంటలు..
సభలో తీవ్ర గందరగోళం కొనసాగుతుండగానే స్పీకర్ సభలో ప్రవేశించారు.
స్పీకర్ వచ్చీ రాగానే 'ఐటమ్ నంబర్ 20ఎ - శ్రీ సుశీల్‌కుమార్ షిండే' అని ప్రకటించారు.
'నేను ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును ప్రవేశపెడుతున్నా ను' అని ఆయన ప్రకటిస్తుండగానే
స్పీకర్ అందిపుచ్చుకుని.. '(సభలో బిల్లును ప్రవేశపెట్టేందుకు) అనుకూలంగా ఉన్న వాళ్లు
'అవును' అనొచ్చు.. లేనివాళ్లు 'కాదు' అనొచ్చు. 'అవును' అన్నారనే నేను భావిస్తున్నాను'
అని ప్రకటించారు.
మధ్యాహ్నం 12.00 గంటలు..
ఇటు... సభలో గొడవ జరుగుతూనే ఉంది. లగడపాటి తన జేబులో ఉన్న 'నాకౌట్
పెప్పర్ స్ప్రే' డబ్బాను బయటకు తీసి తనపై దాడి చేస్తున్న ఎంపీలపై వదిలారు. కొందరు పక్కకు
తప్పుకున్నారు. పొన్నం, గుత్తా, అరుణ్ యూసుఫ్ మాత్రం పట్టు వదల్లేదు. అప్పటికే కొంత
వెసులుబాటు లభించడంతో లగడపాటి చెయ్యి పైకెత్తి కొద్దిసేపు గాలిలో స్ప్రే చేశారు. ఘాటు
తీవ్రంగా ఉండటంతో ఒకటి, రెండు క్షణాల్లోనే అది స్పీకర్, హోం మంత్రి సహా అందరినీ ఆవరించింది.
అందరూ దగ్గడం మొదలు పెట్టారు. లగడపాటికి సమీపంలోనే ఉన్న పొన్నం కళ్లలో నేరుగా స్ప్రే
పడింది. ఆయన తీవ్ర ప్రభావానికి గురయ్యారు.
12.01 గంటలు..
అనూహ్య పరిణామంతో సభ్యులంతా భయాందోళనకు గురయ్యారు. అంతలోనే...
సబ్బం హరి హోం మంత్రి షిండే చేతుల్లో ఉన్న పత్రాలను లాక్కునేందుకు ప్రయత్నించారు. షిండేకు
రక్షణగా ఉన్న హోంశాఖ సహాయ మంత్రి ఆర్పీఎన్ సింగ్‌తో సహా నలుగురు కాంగ్రెస్ ఎంపీలు సబ్బంను
గట్టిగా పట్టుకుని ఆయనను వెనక్కు తీసుకెళ్లారు. ఏం జరుగుతోందో స్పీకర్‌కు అర్థం కాలేదు.
అయోమయం మధ్యే ఆమె తన సీటు విడిచి వెళ్లిపోయారు. పక్కనే ఉన్న ఒక అధికారి సభను మధ్యాహ్నం
2 గంటలకు వాయిదా వేసినట్లు ప్రకటించారు.
12.02 గంటలు..
స్పీకర్ మీరాకుమార్, హోం మంత్రి షిండే బయటకు వెళ్లిపోయారు. సభలో
ఉండొద్దని, స్ప్రే వల్ల హాని కలగొచ్చని, బయటకు వెళ్లిపోవాలని సుష్మా స్వరాజ్‌కు మార్షల్స్
సూచించడంతో ఆమె కూడా వెళ్లిపోయారు.
12.03 గంటలు..
లగడపాటిపై కాంగ్రెస్ ఎంపీలు తమ దాడి ఆపలేదు. కేంద్ర మంత్రి పళ్లంరాజు
వచ్చి గుత్తా సుఖేందర్ రెడ్డిని పక్కకు తప్పించారు. లగడపాటి తేరుకునేలోపు టీడీపీ ఎంపీ
రమేశ్ రాథోడ్ హఠాత్తుగా వచ్చి మళ్లీ దాడికి దిగారు. మిగిలిన కేంద్ర మంత్రులు, సీమాంధ్ర
ఎంపీలు కొందరు జరిగినదంతా చూస్తూ నిశ్చేష్ఠులైపోయారు. పురందేశ్వరి వెల్‌లోనికి వెళ్లేందుకు
ప్రయత్నించగా... కాంగ్రెస్ ఎంపీ రత్నాసింగ్ తదితరులు అడ్డుకున్నారు. 'ఎందుకు అడ్డుకుంటున్నారు?'
అని పురందేశ్వరి ప్రశ్నించగా... 'మిమ్మల్ని కదలనివ్వొద్దని మాకు ఆదేశాలు జారీ చేశారు'
అని వారు అడ్డుపడ్డారు.
12.04 గంటలు..
స్ప్రే ఘాటు సభ మొత్తం ఆవరించటంతో సభ్యులంతా బయటకు వెళ్లిపోవాలని
సిబ్బంది కోరారు. చాలామంది సభ్యులు, విలేకరులు కళ్ల నుంచి నీరు కారుతుండగా, ముక్కులకు
గుడ్డలు కప్పుకుని, దగ్గుతూ బయటకు నడిచారు.
12.30 గంటలు..
అస్వస్థతకు గురైన ఎంపీ పొన్నం ప్రభాకర్‌ను సహచర సభ్యులు కొందరు
పార్లమెంటు భవనం నుంచి వెలుపలికి తీసుకొచ్చి, అంబులెన్స్‌లో ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తరలించారు.
లగడపాటిని మార్షల్స్ అదుపులోకి తీసుకున్నారు. స్ప్రే ప్రభావంతో ఆయన కూడా అస్వస్థతకు
గురయ్యారు. తొలుత లగడపాటిని కూడా ఆస్పత్రికి తీసుకెళ్లాలని భావించినప్పటికీ... 'నేను
బాగానే ఉన్నాను' అని చెప్పడంతో ఆయనకు మూడో అంతస్తులోని ఒక గదిలో పార్లమెంటు అనెక్స్‌లోని
వైద్యులచేత ప్రథమ చికిత్స చేయించారు.
1.15 గంటలు..
"ఎంపీలను చంపేందుకు ప్రయత్నించారు. కఠిన చర్యలు తీసుకుంటాం.
హత్యాయత్నం కేసు పెడతాం'' అని షిండే, కమల్‌నాథ్ ప్రకటించారు.
1.45 గంటలు..
విరిగిపోయిన మైక్‌ను సిబ్బంది సరిచేశారు. ల్యాప్‌టాప్‌ను యథాస్థానంలో
ఉంచారు. సీమాంధ్ర ఎంపీలను అడ్డుకున్న ఇతర రాష్ట్రాల సభ్యులను కాంగ్రెస్ పెద్దలు, నేతలు
అభినందించారు. సభలోకి వస్తున్న మోదుగుల, సబ్బం హరి తదితరులను భద్రతా సిబ్బంది అడ్డగించగా..
'స్పీకర్ మమ్మల్ని సస్పెండ్ చేయకుండా మీరెలా అడ్డుకుంటారు?' అని మోదుగుల వారిపై ఆగ్రహం
ప్రదర్శించారు. సీమాంధ్ర ఎంపీలంతా లోనికి వచ్చారు.
1.48 గంటలు..
కాంగ్రెస్ ఎంపీలంతా తిరిగి స్పీకర్ పోడియంకు అటువైపు, ఇటువైపు
రక్షణగా నిలబడ్డారు. మోదుగుల, కొనకళ్ల నారాయణరావు పోడియం వద్దకు వెళుతుంటే వారు అడ్డుకున్నారు.
'ఏం జరుగుతోందో అంతా చూస్తున్నారు. ఇక్కడ ఇన్ని సీసీటీవీలు, కెమెరాలు ఉన్నాయి' అని
కొనకళ్ల అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొనకళ్ల, మోదుగులతో వాగ్వాదానికి దిగారు.
2.00 గంటలు..
స్పీకర్ మీరాకుమార్ సభలోకి వచ్చారు. 16 మంది ఎంపీలను సస్పెండ్
చేస్తున్నట్లు ప్రకటించి వారి పేర్లు చదువుతుండగానే... వెల్‌లోనే కొనకళ్ల నారాయణరావు
గుండె పట్టుకుంటూ కుప్పకూలిపోయారు. మార్షల్స్ ఆయన్ను బయటకు తెచ్చి ఆర్ఎంఎల్ ఆస్పత్రికి
తరలించారు. స్పీకర్ సభ్యుల్ని సస్పెండ్ చేయగానే... అవిశ్వాస తీర్మానాలను చేపట్టారు.
సభలో గందరగోళం ఉన్నందున వీటిని సభ దృష్టికి తీసుకురాలేకపోతున్నానంటూ ప్రభుత్వం, పార్లమెంటరీ
పత్రాలను సభలో ప్రవేశపెట్టాలని ప్రకటించి, సభను మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు.
అయితే, సస్పెండ్ అయిన సీమాంధ్ర ఎంపీలు సభలోనే కూర్చున్నారు. కేంద్ర మంత్రులు సైతం వారితోపాటు
సభలోనే ఉన్నారు.
3.00 గంటలు..
సీమాంధ్ర ఎంపీలు మళ్లీ పోడియం వద్దకు వస్తుండగానే సభను సోమవారానికి
వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ స్థానంలో ఉన్న సత్పాల్ మహరాజ్ ప్రకటించారు.
సాయంత్రం 5.00 గంటలు..
లగడపాటి పార్లమెంటు భవనం నుంచి బయటకు వచ్చారు. సబ్బంహరితో కలిసి
తన ఇంటికి వెళ్లిపోయారు. అంతకుముందు ఆయనను ఉండవల్లి, కేవీపీ తదితరులు పరామర్శించారు.
'వాయిదా' ఎప్పటికి?
సభ వాయిదాపై స్పీకర్ మీరాకుమార్ కాస్త తడబడ్డారు. గురువారం మధ్యాహ్నం
2 గంటలకు సభ్యులను సస్పెండ్ చేసిన తర్వాత... స్పీకర్ సభను వాయిదా వేశారు. అయితే...
ఈ సమయంలో 'సభ తిరిగి సోమవారం సమావేశమవుతుంది' అని తెలిపారు. అంతలోనే... మధ్యాహ్నం
3 గంటలకు తిరిగి సమావేశమవుతుందని 'పొరపాటు'ను సరిదిద్దుకున్నారు. అంతలో... 3 గంటలకు
సభ సమావేశమైనప్పుడు బిల్లును ఆమోదిస్తారనే ప్రచారం జోరుగా జరిగింది. అయితే, 3 గంటలకు
ప్యానల్ స్పీకర్ మాత్రమే వచ్చి సభను సోమవారానికి వాయిదా వేశారు.
'అవిశ్వాసం' ఎప్పుడు?
యూపీఏ ప్రభుత్వంపై సీమాంధ్ర ఎంపీలు ప్రవేశపెట్టిన తీర్మానం గురువారం
కూడా చేపట్టలేకపోయారు. అయితే... ఇందులో చిన్న 'మలుపు' ఉంది. గురువారం సీమాంధ్ర సభ్యులను
సస్పెండ్ చేసిన తర్వాత స్పీకర్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. అయితే... సస్పెండ్ అయినవారిలో
అవిశ్వాసం నోటీసు ఇచ్చిన సభ్యులూ ఉన్నారు. దీంతో, అవిశ్వాసం నోటీసును పక్కన పెట్టాల్సి
వచ్చింది. సభ్యులను సస్పెండ్ చేసిన తర్వాత, వారు ఇచ్చిన నోటీసును స్పీకర్ మీరాకుమార్
ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది.
0 comments:
Post a Comment